ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా కటక్‌లో భారత్‌తో జరుగుతోన్న ఐదో వన్డేలో ఇంగ్లాండ్ మంచి స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ పీటర్సన్ సెంచరీ (111 నాటౌట్) నమోదు చేయడంతో బాటు షా (66 నాటౌట్) అర్ధ సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్ జట్టు 271 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.
ఇంగ్లాండ్ జట్టులో పీటర్సన్, షాల తర్వాత ఓపెనర్లు కుక్ (10), బొపారా (24)లు తక్కువ స్కోరుకే ఔట్ కాగా కాలింగ్‌వుడ్ (40) మెరుగ్గా ఆడాడు. అయితే ఫ్లింటాఫ్ (0) మాత్రం నిరాశపరిచాడు. భారత జట్టులో జహీర్‌ఖాన్ రెండు వికెట్లు సాధించగా ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్‌లు చెరో వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ప్రారంభం నుంచే ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. అయితే జహీర్ ఖాన్ ఓపెనర్లు కుక్ (10), బొపారా (24)లను ఔట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.
అయితే ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం విజృంభించి ఆడిన పీటర్సన్ సెంచరీ సాధించడం ద్వారా ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించేందుకు సాయం చేశాడు. పీటర్సన్‌కు తోడు షా వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అయితే పీటర్సన్, షాలకు ముందు ఔటైన కాలింగ్‌వుడ్ (40) మెరుగ్గా ఆడగా ఫ్లింటాఫ్ (0) నిరాశపరిచాడు. దీంతో ఇంగ్లాండ్ మరింత స్కోరు సాధించలేక పోయింది.