యువరక్తం.. యువ సారథ్యం.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరపించిన సామర్థ్యం.. స్థిరమైన నిలకడ. దూకుడులో పోటీతత్వం.. ఎదురొడ్డి పోరాడటంలో ధీరత్వం. ఇలా.. అన్ని సుగుణాలు కలగలిసిన జట్టు ధోనీ సేన. పర్యాటక ఇంగ్లండ్ జట్టును ముప్పతిప్పలు పెడుతోంది. దీంతో 'టీమ్ ఇండియా'కు ఇంగ్లండ్ ఏమాత్రం గట్టి పోటీని ఇవ్వలేకపోతోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బుధవారం కటక్‌లోని బారామతి స్టేడియంలో ఇంగ్లండ్ మరోసారి అగ్నిపరీక్షకు సిద్ధమైంది. ఏడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వరుస పరాజయాలతో కుంగిపోయిన పీటర్సన్ సేన.. తమకు అచ్చొచ్చిన కటక్‌లో తొలివిజయాన్ని నమోదు చేయాలని గట్టిపట్టుదలతో ఉంది.
ఇదిలావుండగా.. భారత్ ఇప్పటికే 4-0 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుని క్వీన్‌స్వీప్‌పై దృష్టిసారించింది. ఈ పరిస్థితుల్లో బారాబతి స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం ఫడ్‌లైట్ల వెలుగులో ఐదో వన్డే జరుగనుంది. తొలి నాలుగు వన్డేలకు రిజర్వు బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లకు తుది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
ఎలాంటి పిచ్‌లపైనైనా నిలకడగా రాణించే వీరే విరాట్ కోహ్లి, యువ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, యువ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝాలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే.. ఇంగ్లండ్ జట్టులో కూడా పెద్దగా రాణించని ఆటగాళ్ళకు రిజర్వు బెంచ్‌కు పరిమితం చేసి, కొత్త ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా.. ఇంగ్లాండ్ జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది.