ఆసియా క్రీడల్లో క్రికెట్: భారత్ వైఖరిపై విమర్శల వెల్లువ!!
చైనాలో జరుగనున్న ఆసియన్ గేమ్స్‌లో మొట్టమొదటిసారిగా క్రికెట్‌ను చేర్చడంపై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషపడుతుంటే.. ఆసియన్ గేమ్స్‌లో భారత క్రికెట్ జట్టు పాల్గొనకపోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.ఆసియన్ గేమ్స్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు చైనాలోని జువాంగ్ నగరంలో స్టేడియాలు సిద్ధమయ్యాయి. బంగ్లాదేశ్‌కు చెందిన స్టేడియం ఏర్పాటు దారు జాషిమ్ సైతం నిర్మాణ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్ పోటీల్లోనే క్రికెట్ మ్యాచ్‌లను చేర్చాలనే డిమాండ్ రావడంతో ఆసియన్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఆసియన్ గేమ్స్ క్రికెట్ మ్యాచ్‌ల్లో ప్రపంచ నెంబర్ వన్ భారత క్రికెట్ జట్టు పాల్గొనడం లేదు. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టును బీసీసీఐ చైనాకు ఎందుకు పంపడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.అయితే న్యూజిలాండ్‌తో జరుగనున్న మూడు టెస్టులు, ఐదో వన్డే మ్యాచ్‌ల సిరీస్.. ఐసీసీ షెడ్యూల్లో స్థానం దక్కించుకోవడం ద్వారా ఆసియన్ గేమ్స్‌లో భారత్ ఆడటం కష్టమని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం జాతీయ జట్టును పంపడం కుదరకపోతే సురేష్ రైనా నాయకత్వంలోని మరో భారత జట్టు జింబాబ్వేలో పర్యటించినట్లు, వేరొక జట్టును ఆసియన్ గేమ్స్ పంపే నిర్ణయం కూడా కలిసిరాలేదు. రెండో స్థాయి జట్టును ఆసియన్ గేమ్స్ బరిలోకి దించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని భారత ఒలింపిక్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి రందీవ్ సింగ్ తేల్చి చెప్పారు. కానీ భారత్ రెండో స్థాయి క్రికెట్ జట్టు ఆసియన్ గేమ్స్ కోసం పంపినా పర్వాలేదని చైనా ఒలింపిక్ సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే బీసీసీఐకి-రందీవ్లకు మధ్య చోటుచేసుకున్న విభేదాల కారణంగా భారత క్రికెట్ జట్టు ప్రతిష్టాత్మక ఆసియన్ గేమ్స్‌లో ఆడలేకపోయింది. ఆసియన్ గేమ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఆడకపోవడంపై చైనాలోని క్రికెట్ అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఈ విషయమై జువాంగ్‌లో ఆసియన్ గేమ్స్ కోసం పనిచేస్తున్న ఓ అధికారి మాట్లాడుతూ.. చైనాలో క్రికెట్ అభివృద్ధికి, భారత్ లాంటి జట్లు తమ దేశంలో ఆడటం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. భారత క్రికెటర్లు పాల్గొనకుండా ఆసియన్ గేమ్స్‌లో ట్వంటీ-20 మ్యాచ్‌లు జరుగబోతుండటం తమను నిరాశకు గురిచేసిందని చెప్పారు.