Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు: మురళీధరన్!

ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు: మురళీధరన్!
PTI
శ్రీలంక మేటి స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్ల ప్రపంచ రికార్డుకు గాలె వేదికైంది. అద్భుతమైన స్పిన్ ఇంద్రజాలంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ల గుండెల్లో దపుట్టించిన ముత్తయ్య మురళీధరన్, గురువారం 800 వికెట్లు సాధించిన ఏకైక టెస్టు బౌలర్‌గా క్రికెట్ చరిత్ర సృష్టించాడు. తన జీవితంలో ఈ రోజు మరిచిపోలేని రోజని ముత్తయ్య అభిమానుల మధ్య వెల్లడించాడు.

భారత్‌తో గాలెలో జరిగిన తొలి టెస్టు ఐదో రోజైన గురువారం ముత్తయ్య 800 వికెట్ల రికార్డును సృష్టిస్తాడని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రజ్ఞాన్ ఓజా వికెట్‌ను స్పిన్ మాంత్రికుడు పడగొట్టడంతో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫలితంగా గాలె టెస్టుకు అనంతరం అంతర్జాతీయ టెస్టు క్రికెట్ స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్న ముత్తయ్య, సూపర్ రికార్డు, ఘన వీడ్కోలుతో సంప్రదాయ ఫార్మాట్‌కు స్వస్తి చెప్పనున్నాడు. ఇందుకుగాను శ్రీలంక బోర్డు స్పిన్ మాంత్రికుడికి ఘన వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది.

టెస్టు క్రికెట్‌లో 792 వికెట్లు సాధించిన ముత్తయ్య మురళీధరన్ గాలె టెస్టులో ఎనిమిది వికెట్లు తీసి సరికొత్త రికార్డు నెలకొల్పాలనే సంకల్పంతో బరిలోకి దిగాడు. అనుకున్నట్టుగానే గాలె మైదానంలో బలమైన జట్టు భారత్‌తో జరిగిన తొలి టెస్టు, తన చివరి మ్యాచ్‌‌లో ఎలాంటి ఒత్తిడికి, ఉద్వేగానికి లోనుకాకుండా లెజండ్ డాన్ బ్రాడ్‌మన్ తరహాలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లపై చిరునవ్వుతో కూడిన బౌలింగ్‌తో దాడి చేశాడు.

ఈ క్రమంలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టిన ముత్తయ్య, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు సాధించి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే భారత్ తొలి ఇన్నింగ్స్‌‌లో‌‌‌ ఐదుగురు బ్యాట్స్‌మెన్స్‌ను అవుట్‌చేసి భారత్‌పై ఏకంగా వంద వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డును తన పేరుమీద లిఖించుకున్న విషయం తెల్సిందే.

శ్రీలంకలోని చిన్నపాటి పట్టణమైన కాండిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఏప్రిల్ 17, 1972వ సంవత్సరంలో పుట్టిన ముత్తయ్య మురళీధరన్, అటు టెస్టు, ఇటు వన్డే ఫార్మాట్‌లలో సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రాణించాడు. 38 ఏళ్ల స్పిన్ బౌలర్ ముత్తయ్య తన బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు ఎదుర్కొన్నా, తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ తనపై విమర్శలు కురిపించిన వారిపై దాడికి దిగకుండా, ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేసుకున్నాడు.
webdunia
PTI


ఇంకా తన బౌలింగ్ యాక్షన్‌పై 1996 మరియు 1999 సంవత్సరాల్లో ఐసీసీ నిర్వహించిన శల్య పరీక్షల్లోనూ నెగ్గాడు. మీడియమ్ పేస్ బౌలర్‌గా బరిలోకి దిగి స్పిన్ బౌలర్‌గా ఎదిగిన ముత్తయ్య, ఆస్ట్రేలియాతో ఆగస్టు 28వ తేదీ, 1992వ సంవత్సరం జరిగిన టెస్టు ద్వారా క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 141 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.

ఏడాది తర్వాత సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఐదు వికెట్లు (5-104) సాధించి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. అలాగే 1995వ సంవత్సరంలో ఏకంగా 19 వికెట్లు సాధించి, శ్రీలంకను 2-1 తేడాతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మార్చి 16,1997వ సంవత్సరం వంద వికెట్లు సాధించిన శ్రీలంక బౌలర్‌గా రికార్డు సాధించిన ముత్తయ్య, 1998వ సంవత్సరంలో జింబాబ్వేపై పది వికెట్లు సాధించిన లంక బౌలర్‌గా ఘనతకెక్కాడు.

ఇదే యేడాది ఆగస్టు నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏకంగా 16-220 వికెట్లు పడగొట్టిన మురళీధరన్, మార్చి 16,2004వ సంవత్సరం ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో 500 వికెట్లు సాధించిన యువ బౌలర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. డిసెంబర్ మూడో తేదీ, 2007వ సంవత్సరం ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 709 వికెట్ల క్లబ్‌కు చేరుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu