హామిల్టన్ టెస్టు: న్యూజిలాండ్‌కు స్వల్ప ఆధిక్యత
స్వదేశంలోని హామిల్టన్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుకు స్వల్ప ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టును 231 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 33 పరుగుల ఆధిక్యత లభించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు రెండో రోజైన ఆదివారం అన్ని వికెట్లను కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆ జట్టులో బ్యాట్స్‌మెన్ టేలర్ (138) సెంచరీతో రాణించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించిన టేలర్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా, జట్టుకు స్వల్ప ఆధిక్యాన్ని అందించాడు. కివీస్ జట్టులో వాట్లింగ్ (46), సౌథీ (22), వెట్టోరి (15), సింక్లైర్ (11)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆసీస్ బౌలర్లలో బోలింగర్, హారీస్‌లు మూడేసి వికెట్లు తీయగా, జాన్సన్ నాలుగు వికెట్లు తీశాడు. తన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 33 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది.