స్లో ఓవర్ రేటు: గంగూలీ సేన కేకేఆర్‌పై భారీ జరిమానా!
టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించే ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై స్లో ఓవర్ రేటు కారణంగా భారీ జరిమానా విధించారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో బుధవారం జరిగిన 39వ లీగ్ మ్యాచ్‌లో కెప్టెన్ సౌరవ్ గంగూలీపై 40వేల డాలర్లు, జట్టు సభ్యులకు పదివేల డాలర్ల చొప్పున ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా 39వ లీగ్ మ్యాచ్‌లో గౌతం గంభీర్ సేన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను కేకేఆర్ 14 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చివరి రెండు ఓవర్లలో కేకేఆర్ బౌలింగ్ చేసేందుకు అధిక సమయాన్ని తీసుకోవడంతో ఐపీఎల్ యాజమాన్యం ఆ జట్టు కెప్టెన్, సభ్యులపై భారీ జరిమానా విధించాల్సి వచ్చింది. కాగా.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో గంగూలీ సేన విజయం సాధించడం ద్వారా పది పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ డేర్‌డెవిల్స్ 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం.