సెమీస్ రేసులో ఢిల్లీ: ఛాలెంజర్స్‌తో రేపు డేర్‌డెవిల్స్ ఢీ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు విజయపరంపరను కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం మూడు వరుస విజయాలతో దూసుకెళుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఐపీఎల్ సెమీఫైనల్ రేసులో ఉంది. దీంతో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగనున్న 35వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ గెలుపును లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. వరుస విజయాలతో ఐపీఎల్ పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లో ఐదింటిలో గెలిచింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ఢిల్లీ డేర్‌డెవిల్స్.. పది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కానీ సమమైన విజయాలు, సమానమైన పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోన్న బెంగళూరుపై ఆదివారం జరిగే మ్యాచ్‌లో నెగ్గాలనే ఉద్దేశంతో ఢిల్లీ బరిలోకి దిగనుంది. ఇప్పటికే మార్చి 25వ తేదీన జరిగిన 20వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో బెంగళూరుపై 17 పరుగుల తేడాతో ఢిల్లీ గెలిచింది. కాబట్టి ఆదివారం జరిగే మ్యాచ్‌లోనూ బెంగళూరుపై ఢిల్లీ గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి డివిలియర్స్, తిలకరత్నే దిల్షాన్ వంటి మేటి బ్యాట్స్‌మెన్లతో ఢిల్లీ జట్టు పటిష్టంగా ఉండటమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకూడా ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో ప్రతీకారం తీసుకోవాలనుకుంటోంది.