కరేబియన్ దీవుల్లో ఒకటైన ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ స్టేడియంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి 12 నెలల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధిత కాలంలో ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను ఇక్కడ నిర్వహించడానికి వీలులేకుండా పోయింది. గత ఫిబ్రవరిలో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల రెండో టెస్ట్ ఆరంభమైంది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత పది బంతులు వేశాక ఈ టెస్ట్‌ను రద్దు చేశారు.
ఐసిసి ప్రమాణాలకు అనుగుణంగా పిచ్, ఔట్ ఫీల్డ్‌లు లేనందున టెస్ట్‌ను రద్దు చేయడం జరిగింది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే స్థాయిలో రిచర్డ్స్ స్టేడియంలో ప్రమాణాలు, పిచ్‌లు లేవని, అందువల్ల యేడాది పాటు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించరాదని ఐసిసి స్పష్టం చేసింది.
ఉన్నత స్థాయి ప్రమాణాలతో స్టేడియాన్ని సిద్ధం చేసేందుకు 12 నెలల సమయాన్ని ఐసిసి కేటాయించింది. ఆ తర్వాత స్టేడియంలో ఐసిసి ప్యానెల తనిఖీ చేసిన తర్వాతే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతి ఇచ్చే విషయంపై తగు నిర్ణయం తీసుకుంటామని ఐసిసి విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డోనాల్డ్ పీటర్స్ మాట్లాడుతూ.. ఐసిసి ఆదేశాలను శిరసావహిస్తున్నాం. ఆంటిగ్వా క్రికెట్ అసోసియేషన్, ప్రభుత్వం కలిసి ఈ స్టేడియంను తిరిగి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ చేసిన క్రికెట్ సేవలకు గుర్తింపుగా ఈ స్టేడియానికి ఆయన పేరు పెట్టారు.