శ్రీలంక క్రికెటర్లకు గట్టి భద్రతను కల్పించడంలో తమ ప్రభుత్వం విఫలమైనట్టు పాకిస్థాన్ క్రీడల మంత్రి ఫిర్ ఆఫ్తాబ్ షా జిలానీ స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాబోవన్నారు. ముఖ్యంగా, 2011 ప్రపంచ కప్ పోటీలకు గట్టి భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు భీకర దాడులు జరిపిన తర్వాత పాక్ అధికారుల జరిగిన తప్పును అంగీకరించడం ఇదే తొలిసారి. ఈ దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మృత్యువాత పడగా, ఆరుగురు క్రికెటర్లు గాయపడిన విషయం తెల్సిందే.
అయితే, తమ దేశంలో పర్యటిస్తున్న విదేశీ క్రికెటర్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత స్టేడియం ఉన్న ప్రొవిన్స్ ప్రభుత్వాలదే కానీ, ఫెడరల్ గవర్నమెంట్‌ది కాదని ఆయన చెప్పినట్టు ఆస్ట్రేలియన్ డైలీ పత్రిక పేర్కొంది. దాడికి గల లోపాలను తమ ప్రభుత్వం గమనించింది. సరైన భద్రతను కల్పించ లేకపోయాం.
అయితే, ఇలాంటివి పునరావృత్తం కాబోవని మీకు హామీ ఇస్తున్నాను అని ఆయన చెప్పారు. మ్యాచ్ ప్రారంభమైన తొలి రెండు రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ సజావుగా సాగి పోయింది. అయితే, మూడో రోజున ఎక్కడో లోపం జరిగిందన్నారు. ఇది ఖచ్చితంగా ప్రొవిన్స్ అధికారుల తప్పేనని జిలానీ వెల్లడించారు.