వెల్లింగ్టన్‌లో జరుగుతున్న కీలకమైన మూడో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. భారత బౌలర్లు రాణించడంతో ఆతిథ్య జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీం ఇండియాకు 182 పరుగుల అమూల్యమైన ఆధిక్యం లభించింది. బౌలర్లు రాణించి తక్కువ పరుగులపై కివీస్‌ను కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు మలిరోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ సెహ్వాగ్ వికెట్‌ను కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం మొత్తం 233 పరుగుల ఆధిక్యం లభించింది. క్రీజ్‌లో ద్రావిడ్ (9), మరో ఓపెనర్ గౌతం గంభీర్ (28) ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ భారత బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది.
జహీర్ ఖాన్ చెలరేగడంతో కివీస్ బ్యాట్స్‌మెన్ ఒకరివెంట ఒకరు పెవీలియన్ దారిపట్టారు. ఓపెనర్ మెక్‌లాంతోష్ (32), టేలర్ (42)లు మాత్రమే భారత బౌలర్లను ఓ మోస్తారుగా అడ్డుకున్నారు. మిగిలినవారందరూ బౌలర్లకు దాసోహమన్నారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్ ఐదు వికెట్లు పడగొట్టగా, హర్భజన్ సింగ్ మూడు, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.