సొంత గడ్డపై భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. 615 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్ జహీర్ ఖాన్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్‌ల బౌలింగ్ ధాటికి 84 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ టేలర్, ఫ్రాంక్లిన్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా అడుతున్నారు.
అంతకుముందు 349 పరుగుల మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన భారత్ ఏడు వికెట్లను కోల్పోయి 437 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా కివీస్ ముంగిట 616 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో గంభీర్ (167), ద్రావిడ్ (60), లక్ష్మణ్ (61), యువరాజ్ సింగ్ (40), ధోనీ (52 నాటౌట్)లు రాణించడంతో భారత్ మరోమారు భారీ స్కోరు చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్‌కు జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ మెకింతోష్ జహీర్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఫ్లైన్‌ను కూడా జహీర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 54 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.
ఇద్దరు ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కివీస్‌ను హర్భజన్ సింగ్ మరో దెబ్బ తీశాడు. 32వ ఓవర్లలో ఒక్క బంతి తేడాతో గుప్తిల్ (49), రైడర్ (0)లను పెవిలియన్‌కు పంపి కివీస్ ఆటగాళ్ల రెక్కలు విరిచాడు. ఫలితంగా ఆ జట్టు 84 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయి, ఓటమి దిశగా సాగుతోంది.