వివాదంలో చిక్కుకున్న ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణ..!
కేంద్ర పౌర విమానయానా శాఖా మంత్రి ప్రఫుల్ పాటిల్ కుమార్తె పూర్ణా పటేల్ వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఓ ఎయిర్ ఇండియా విమానం సేవను రద్దు చేసి, సొంత పనులకు వాడుకున్నట్లు పూర్ణాపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా సేవను రద్దు చేసి ఆ విమానాన్ని పూర్ణా పటేల్ తన సొంత పనుల కోసం బాడుగకు తీసుకున్నట్లు సమాచారం. ఈ విమానంలో పూర్ణా పటేల్ ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రయాణం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఐపీఎల్‌లో భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఛైర్మన్ లలిత్ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో... బిలియన్ డాలర్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తలెత్తిన వివాదం రోజుకో రకంగా మలుపులు తిరుగుతోంది. ఐపీఎల్ కొచ్చి ఫ్రాంచైజీ వివాదంలో చిక్కుకుని ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. తాజాగా మరో కేంద్ర మంత్రి ప్రఫుల్ పాటిల్‌కు కూడా ఐపీఎల్‌లో సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదేవిధంగా కొచ్చి ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడానికి మంత్రి థరూర్‌కు ప్రఫుల్ పాటిల్ సహకరించారని, ఇందులో ఆమె కుమార్తె పూర్ణా పటేల్‌కు సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే.. ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీ-కోయంబత్తూరుల మధ్య నడిచే ఎయిర్ ఇండియా విమాన సేవను రద్దు చేయడం పూర్ణా సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఇంకా ఈ విమానంలో పూర్ణా కొంతమంది ఐపీఎల్ ఆటగాళ్లతో ఛంఢీఘడ్ నుంచి చెన్నై వరకు ప్రయాణం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత 20వ తేదీ ఉదయం 5.20 గంటలకు ఢిల్లీ నుంచి కోయంబత్తూరు మధ్య నడిచే విమానం 12 గంటలకు ముందు రద్దైందని తెలిసింది.