వెల్లింగ్టన్‌లో భారత్‌తో జరుగనున్న మూడో టెస్టుకు వాతావరణం అనుకూలించాలని న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్ కల్లమ్ దేవుడిని ప్రార్థించాడు. శుక్రవారం (ఏప్రిల్ 3) ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌కు మంచు, వర్షంతో అంతరాయం కలుగకూడదంటూ కల్లమ్ మొక్కుకున్నాడు.
వాతావరణం అనుకూలిస్తే పిచ్‌లపై తమ ఆటగాళ్లు ధీటుగా రాణిస్తారని మెక్ కల్లమ్ పేర్కొన్నాడు. భారత్‌తో నేపియర్‌లో జరిగిన రెండో టెస్టు లాగానే ఈ టెస్టులోనూ బౌలర్లు బాగా ఆడతారని ధీమా వ్యక్తం చేశారు. హామిల్టన్ టెస్టు తర్వాత తమ జట్టులో కొత్త ఉత్సాహం వచ్చిందని, మూడో టెస్టును తప్పకుండా జట్టు కైవసం చేసుకునే దిశగా ఆటగాళ్లు సమిష్టిగా కృషి చేస్తారని మెక్ కల్లమ్ నమ్మకం వ్యక్తం చేశాడు.
ఓపెనర్లు నిలకడగా, నేర్పుతో ఆడాలని లేని పక్షంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లపై భారం పడే అవకాశం ఉందని కల్లమ్ అభిప్రాయపడ్డాడు. అందుచేత బ్యాట్స్‌మన్లు, బౌలర్లు ప్రత్యర్థి జట్టు ఆటతీరుకు అనుకూలంగా గట్టీపోటీని ప్రదర్శించాల్సి ఉంటుందన్నాడు.
తొలి రెండు టెస్టు మ్యాచ్‌లలో అంతగా రాణించలేక పోయిన టిమ్ నుంచి మూడో టెస్టులో మంచి ప్రదర్శనను ఆశించవచ్చునని కల్లమ్ అన్నాడు. మైదానంలో బౌలర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు టిమ్ తీవ్రంగా కృషి చేస్తున్నాడని చెప్పాడు. కివీస్ జట్టు మంచి ఫామ్‌లో ఉందని మెక్ కల్లమ్ పేర్కొన్నాడు.