రాబోయే 2011 ప్రపంచకప్‌ను గెలుచుకున్న తరువాతనే రిటైర్మెంట్ ప్రకటిస్తానని.. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ తన చిరకాల వాంఛను వ్యక్తం చేశాడు. 2011 ప్రపంచ కప్ ట్రోఫీని సాధించిన తరువాత, ఆ తృప్తితోనే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతానని అన్నాడు.
పన్నెండు సంవత్సరాల క్రికెట్ కెరీర్ కలిగిన బౌచర్... ఇప్పటిదాకా 123 టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ, 275 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లోనూ మరియు విజయవంతమైన వికెట్ కీపర్‌గా 466 మందిని అవుట్ చేశాడు.
ఈ సందర్భంగా బౌచర్ మాట్లాడుతూ... 2011 వరల్డ్ కప్ సాధించడమే తన చివరి లక్ష్యమనీ, అయితే అది అనుకున్నంత సులభంకాదనీ చెప్పాడు. ఈ విషయంలో వాస్తవిక ధోరణితో ఆలోచించడం చాలా అవసరమనీ, అదే సమయంలో కప్ సాధించాలనే పట్టుదల కూడా మెండుగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నాడు.
తన క్రీడా జీవితంలో ఎన్నో రకాల ప్రత్యేకాంశాలు ఉన్నప్పటికీ... దానికో గొప్ప ముగింపు 2011 ప్రపంచ కప్ సాధించడమేనని బౌచర్ వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో యువ క్రికెటర్లు చాలా ప్రతిభావంతంగా రాణిస్తున్నారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆట పరంగానే తనకున్న అనుభవాలను యువ ఆటగాళ్లతో పంచుకుని, వారిని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని బౌచర్ తెలిపాడు.