వన్డేలు, టెస్ట్‌లకంటే టీ20లే కీలకం: మైఖేల్ క్లార్క్
టెస్ట్ మ్యాచ్‌లు, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకంటే ట్వంటీ20 మ్యాచ్‌లే ఆటగాళ్లకు కీలకమైనవని ఆస్ట్రేలియా ట్వంటీ20 కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. టీ20 మ్యాచ్‌లలో ఆడటం ద్వారా ఆటగాళ్లు మంచి పాపులారిటీని సంపాదిస్తారనీ.. ప్రేక్షకులు కూడా లెక్కలేనంత ఆనందం పొందుతారని అన్నాడు.కరేబియన్ దీవుల్లో శుక్రవారం నుంచి ట్వంటీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో మైఖేల్ క్లార్క్ డైలీ టెలిగ్రాఫ్ పత్రికతో మాట్లాడుతూ.. టెస్ట్‌లు, వన్డే మ్యాచ్‌లు అన్నింట్లోనూ ఒకేలా ఆడినప్పటికీ.. పరిమిత ఓవర్లలో జరిగే ట్వంటీ20 మ్యాచ్‌లే కీలకమని అన్నాడు. టీ20 మ్యాచ్‌లలో కాస్తంత వైవిధ్యం ఉంటుందనీ, పరిమిత ఓవర్లలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లే ముందంజలో ఉంటారని క్లార్క్ వివరించాడు. అదే విధంగా ఊహించినంత స్థాయిలో ప్రేక్షకులు హాజరవటంతో ఆటగాళ్లు విజయం కోసం ఉవ్విళ్లూరటం కూడా సహజమేనని చెప్పాడు.