వచ్చే వారం కేరళలో కొచ్చి ఫ్రాంచైజీల పర్యటన!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కోసం ఎంపికైన కొచ్చి ఫ్రాంచైజీకి చెందిన యజమానులు వచ్చేవారం కేరళలో పర్యటించనున్నారు. ఐపీఎల్‌లో భారీ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్‌కు గురైన లలిత్ మోడీ వ్యవహారం సద్దుమణగడంతో ఊపిరి పీల్చుకున్న కొచ్చి ఫ్రాంచైజీలు.. జట్టు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొచ్చి ఫ్రాంచైజీల వివరాలను ట్విట్టర్‌లో పెట్టడం ద్వారా చిక్కుల్లో పడిన లలిత్ మోడీ, ఏకంగా ఛైర్మన్ పదవి నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడీ వ్యవహారంతో జోక్యం చేసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఊరట చెందిన కొచ్చి ఫ్రాంచైజీలు వచ్చే వారం కేరళలో పర్యటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా.. కేరళ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో కొచ్చి ఫ్రాంచైజీలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా జట్టు, కార్యాలయ ఏర్పాట్లపై చర్యలు తీసుకోనున్నట్లు కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టీసీ మాథ్యూ విలేకరులతో చెప్పారు. కేరళలో ఐపీఎల్ ఏర్పడటం ద్వారా యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లతో ఆడే అవకాశం లభిస్తుందని మాథ్యూ అన్నారు.