లలిత్ మోడీకి ఒక ఛాన్స్ ఇవ్వండి..!: విజయ్ మాల్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ లలిత్ మోడీకి ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా మద్దతు ప్రకటించారు. ఐపీఎల్‌లో భారీ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్న లలిత్ మోడీకి నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఒక అవకాశం ఇవ్వాలని విజయ్ మాల్యా మీడియాతో అన్నారు.లలిత్ మోడీ వ్యవహారంపై కేంద్ర మంత్రి శరద్ పవార్‌తో విజయ్ మాల్యా సమావేశమయ్యారు. అనంతరం విజయ్ మాల్యా మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన లలిత్ మోడీ అవకతవకలకు పాల్పడ్డారనేందుకు నిజా నిజాలు ఇంకా తేటతెల్లం కావాల్సి ఉందని మాల్యా చెప్పారు. లలిత్ మోడీపై ఆరోపణలు ఎంతవరకు నిజమనే విషయాలు తెలియరాని పక్షంలో.. వూహ్యాలకు ప్రాధాన్యమివ్వడం సబబు కాదని మాల్యా సూచించారు. ఇంకా ఐపీఎల్ క్రికెట్‌లో జూదం చోటు చేసుకోలేదని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో నిజాలేంటో..? బయటపెట్టేందుకు లలిత్ మోడీకి ఓ అవకాశం ఇవ్వాలని మాల్యా సూచించారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ఛైర్మన్ పదవికి ఎసరు పెట్టేందుకు బీసీసీఐ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సహ ఛైర్మన్ శ్రీనివాసన్ తదితరులు హాజరైనట్లు సమాచారం. మరోవైపు లలిత్ మోడీ ఎన్ని కారణాలు చెప్పినా ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఏప్రిల్ 26న ఐపీఎల్ పాలకమండలి సమావేశం జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఛైర్మన్ ఆధ్వర్యంలోనే పాలకమండలి సమావేశాలను జరపాలనే మోడీ వాదనను బీసీసీఐ ఏ మాత్రం లెక్కచేయలేదు. ఇంకా లలిత్ మోడీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, మోడీని పదవి నుంచి తప్పించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే.. ముంబైలో శుక్రవారం జరిగిన ఐపీఎల్ ప్రదానోత్సవ కార్యక్రమంలో లలిత్ మోడీ భావోద్వేగానికి గురైయ్యారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను ఐదు రోజుల తర్వాత నిర్వహించాలని కోరారు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు తనపై వెలువెత్తిన ఆరోపణలపై సరైన సమాధానమిచ్చేందుకు డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాల్సి ఉందని మోడీ తెలిపారు. ఇంకా బీసీసీఐ కోసం డబ్బులు తీసుకోకుండా ఎంతో కాలం పనిచేశానని, తనపై వస్తున్న ఆరోపణలు అసత్యమని నిరూపించుకునేందుకు తనకు ఐదురోజుల పాటు అవకాశం కావాలని మోడీ వెల్లడించారు.