కొల్కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్సీపై మరో రెండు రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆ జట్టు మేనేజర్ బుచానన్ చెప్పారు. సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీకి అప్పగించే అంశంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని బుచానన్ అన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రొటేషన్ కెప్టెన్సీ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
కొల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్సీని సౌరవ్ గంగూలీకి దూరం చేయడం ద్వారా క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఆ జట్టు కోచ్ జాన్ బుచానన్ తాజాగా కెప్టెన్సీపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పేర్కొనడం విశేషం. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో మాట్లాడతానని బుచానన్ చెప్పారు. అంతకుముందు కేకేఆర్ కెప్టెన్‌గా ఏ ఒక్క ఆటగాడో ఉండడని బుచానన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ప్రకటన ఇంటా, బయట అసంతృప్తి సెగలు రేపింది. కేకేఆర్ జట్టులోనూ దీనిపై నిరసన వ్యక్తమైంది. గంగూలీ, లక్ష్మీ రతన్ శుక్లా, అరిందమ్ ఘోష్, సౌరవ్ సర్కార్‌లు కేకేఆర్ జట్టు సహాయ సిబ్బందితో సరిగా కలవలేకపోయారు.
ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన ప్రాక్టీసులో బుచానన్, గంగూలీ ఇద్దరు రెండు గంటలకుపైగా గడిపారు. అయితే వారిద్దరు మాట్లాడుకున్నట్లేమీ కనిపించలేదు. ప్రాక్టీసు ముగిసిన అనంతరం బుచానన్ మాట్లాడుతూ.. కెప్టెన్సీపై మరో రెండు రోజుల్లో మాట్లాడతానన్నారు. గంగూలీ మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించాడు.