రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియాకు నేతృత్వం వహిస్తున్న డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం సాగడంపై మాట్లాడుతూ.. క్యాచ్‌లు వదిలిపెట్టడం ఇందుకు కారణమైందన్నాడు. జట్టు ఫీల్డింగ్ మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారన్నాడు.
తమ కుర్రాళ్లు సరిగ్గా క్యాచ్‌లు తీసుకొని ఉంటే తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు లేదా ఎనిమిది వికెట్లు దక్కించుకొని ఉండేవారని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంకా సెహ్వాగ్ మాట్లాడుతూ... "నాలుగు పరుగుల వద్ద టేలర్ ఇచ్చిన క్యూచ్‌ను జారవిడవడం పెద్ద దెబ్బ. అలా వదిలిన తర్వాత అతను రెచ్చిపోయి సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రైడర్‌తో కలిసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు.
నాలుగు పరుగుల వద్ద అతని క్యాచ్ తీసుకొని ఉంటే ఆతిథ్య జట్టు స్కోరు అప్పటికి 25/4 అయ్యేది. అయితే ఈ తప్పిదం.. నాలుగో వికెట్‌కు 271 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి కారణమైంది. యువరాజ్ సింగ్ థర్డ్ స్లిప్‌లో టేలర్ క్యాచ్ వదిలిపెట్టకుండా ఉంటే ఆతిథ్య జట్టు కష్టాల్లో పడి ఉండేది. అతని క్యాచ్ వదిలిపెట్టి మూల్యం చెల్లించుకున్నాం" అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే యువరాజ్ సింగ్ ఫ్రాంక్లిన్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా వదిలిపెట్టాడు. మిగిలిన రోజుల్లో ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. నేపియర్‌లోని మెక్‌లీన్ పార్కులో గురువారం ప్రారంభమైన రెండో టెస్ట్ తొలిరోజున ఆటముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 351/4 స్కోరు చేసింది.