మోడీ వ్యవహారం: ఢిల్లీకి చేరుకున్న బీసీసీఐ అధ్యక్షుడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సంసిద్ధమవుతోంది. కొచ్చి ఫ్రాంచైజీ వివాదంలో ఆదాయ పన్ను శాఖ నిర్వహించిన తనిఖీలతో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ గుట్టురట్టైంది. ఇంకా లలిత్ మోడీ సంపాదించిన ఆస్తులు, బెట్టింగ్, బ్లాక్ మనీ వంటి ఇతరత్రా అంశాలపై చర్చలు జరిపేందుకుగాను బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ రాజధాని నగరం న్యూఢిల్లీకి చేరుకున్నారు.ఇందులో భాగంగా ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంపై కేంద్ర మంత్రి శరద్ పవార్‌తో శశాంక్ మనోహర్ చర్చలు జరుపుతారని సమాచారం. అలాగే శశాంక్ మనోహర్.. శరద్ పవార్‌తో పాటు బీసీసీఐ ఉన్నతాధికారులతో కూడా భేటీ కానున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ఛైర్మన్ పదవి నుంచి లలిత్ మోడీని తొలగించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా శశాంక్ మనోహర్.. శరద్ పవార్‌తో భేటీ కావడం మోడీని ఛైర్మన్ పదవి నుంచే తప్పించేందుకేనని సమాచారం. ఇకపోతే.. లలిత్ మోడీ వ్యవహారంపై చర్చలు జరిపేందుకు బీసీసీఐ కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. దీంతో ఈ నెల 24 నుంచి మే 2 తేదీలోపు బీసీసీఐ కార్యవర్గ సమావేశం ఉంటుంది. మరోవైపు ఐపీఎల్ మూడో సీజన్ ముగిసిన వెంటనే.. ఈ నెల 26వ తేదీన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది.