న్యూజిలాండ్ గడ్డపై 41 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ విజయం సాధించిన టీం ఇండియా తాజాగా జరిగిన సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న టీం ఇండియా, తాజాగా టెస్ట్ సిరీస్‌ను కూడా 1-0తో కైవసం చేసుకుంది.
దీనిపై న్యూజిలాండ్ కెప్టెన్ విటోరీ మాట్లాడుతూ.. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీం ఇండియా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు సరిసమానమైన జట్టు అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతోపాటు టీం ఇండియా కూడా ప్రపంచంలో అత్యుత్తమ జట్టు అని చెప్పాడు. తమపై అన్ని విభాగాల్లోనూ టీం ఇండియా ఆధిపత్యం చెలాయించిందని తెలిపాడు.
మూడో టెస్ట్ తొలి రోజు టీం ఇండియా 200/6 వద్ద ఉన్నప్పటి వరకు ఆట తాము అనుకున్నట్లు సాగింది. ఆ తరువాత మ్యాచ్ పూర్తిగా టీం ఇండియా పరమైందన్నాడు. ప్రపంచంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, టీం ఇండియా అత్యుత్తమ క్రికెట్ జట్టులని చెప్పాడు. ప్రస్తుతం ఈ మూడు జట్ల మధ్య తేడాలను గుర్తించడం చాలా కష్టమన్నాడు. టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం ద్వారా తాను తప్పుచేశానని వస్తున్న విమర్శలను విటోరి తిరస్కరించాడు. తన నిర్ణయం సరైనదేనని సమర్థించుకున్నాడు.