ముంబై ఇండియన్స్ ఓడిపోవడం ఎంతో బాధేసింది: బిగ్ బి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూడటంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరిన సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్‌కు టైటిల్ దక్కకపోవడం పట్ల ఒకింత నిరాశ చెందినట్టు చెప్పారు. దీనిపై అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. సచిన్ నాయకత్వంలోని ముంబై సేన ఐపీఎల్ మూడో సీజన్‌లో ఓడిపోవడం మానసికంగా ఆవేదనకు గురిచేసిందన్నారు. కానీ ఐపీఎల్ సెమీఫైనల్ తొలి మ్యాచ్‌లో ఏర్పడిన గాయాన్ని కూడా లెక్కచేయని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రీజులో రాణించడంపై అమితాబ్ ప్రశంసల వర్షం కురిపించారు. అదేసమయంలో టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వూహ్యాలను సమర్థవంతంగా అమలుచేశాడని అమితాబ్ కితాబిచ్చాడు. కానీ ముంబై ఇండియన్స్ పోలార్డ్‌ను రంగంలోకి దించి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒత్తిడిలోకి నెట్టి ఉండవచ్చునని బిగ్‌బి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా ముంబై ఇండియన్స్ అత్యుత్తమ జట్టుగా రాణించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అమితాబ్ తన బ్లాగులో రాసుకున్నారు.