తమ జట్టులో టీం ఇండియా క్రికెటర్లు చూడని కొత్త కుర్రాళ్లు ఉన్నారనీ, ఈ యువ ఆటగాళ్ల గురించి భారత్‌కు అంతగా తెలియదు కాబట్టి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని న్యూజిలాండ్ కోచ్ మోల్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
వరుస విజయాలతో మాంచి ఊపుమీద ఉన్న టీం ఇండియాను నిలువరించడం కష్టమైనప్పటికీ... తమ జట్టులోని గుప్తిల్, ఇలియట్, నీల్‌బ్రూమ్ తదితర యువ ఆటగాళ్లు తమ సత్తాను చాటుకుంటారని మోల్స్ ధీమాగా చెబుతున్నాడు. భారత్ బ్యాట్స్‌మెన్లను ఒత్తిడికి గురి చేసేందుకు తమ వద్ద అన్ని రకాల వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయని మోల్స్ పేర్కొన్నాడు.
అయితే... భారత్ అద్భుతమైన జట్టనీ, అందులో గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల రూపంలో ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఓపెనర్లు ఉన్నారనీ.. మోల్స్ అభిప్రాయపడ్డాడు. ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంతో పాటుగా, మెరుగైన క్రికెట్ ఆడితేనే టీం ఇండియాకు తాము గట్టి పోటీని ఇవ్వగలమని చెప్పాడు.
తమ జట్టు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జట్టని చెప్పిన మోల్స్... తాము బంతిని బౌన్స్ చేయగలిగేలా ఆడితేనే భారత ఆటగాళ్లను ఇబ్బంది పెట్టవచ్చునని పేర్కొన్నాడు. అవకాశం ఉన్నప్పుడల్లా భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టి, ఆ జట్టు బలహీనతలను బట్టబయలు చేసి విజయం సాధించేందుకు... కివీస్ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశమని మోల్స్ చెప్పాడు.
ఏ రకంగా చూసినప్పటికీ... ప్రపంచ క్రికెట్లో టీం ఇండియానే నెంబర్‌వన్ జట్టని మోల్స్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. నిలకడైన ప్రదర్శనకుగానూ.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకంటే ధోనీ సేననే నెం.1గా పరిగణించాలని చెప్పాడు. భారత్ సిరీస్ తమకో సవాల్ లాంటిదనీ, ఆటలోని అన్ని విభాగాల్లో తాము మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని అన్నాడు. అయితే అంతిమంగా బాగా ఆడినట్లయితేనే తమ జట్టు అందరి మన్ననలను పొందుతుందని మోల్స్ తెలిపాడు.