ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో పాక్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండర్ ఖనితా జలీల్ అద్భుతమైన ఆటతీరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. బ్యాట్స్‌ఉమన్ జలీల్ ధాటిగా ఆడి 19 పరుగులు సాధించగా... నైన్ ఆబిది 19, సనా మిర్ 22, సాజిదా సాహ్ 21, ఉరూజ్ 20 పరుగులు చేశారు.
ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 104 పరుగులకే కుప్పగూలిపోయింది. లంక జట్టులోని స్కిప్పర్ శశికళ ఒంటరి పోరాటం చేసి 58 పరుగులు సాధించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పాక్ బౌలర్లలో ఖనితా జలీల్ రెండు వికెట్లు, సనా రెండు వికెట్లు పడగొట్టి జట్టును విజయపథంలో నడిపించారు.
ఇదిలా ఉంటే... తొలి మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో పది వికెట్ల ఘోర పరాజయం పాలయిన పాకిస్థాన్‌కు, ఈ వరల్డ్‌కప్‌లో తాజాగా లంకపై సాధించినది మొదటి విజయం కావడం గమనార్హం.