రాబోయే ప్రపంచకప్‌లో భారీ స్కోర్లు చేసినట్లయితేనే విజయం సాధ్యమవుతుందని.. భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత జట్టు కనీసం 200 పరుగులయినా సాధిస్తేనే పోరాడేందుకు, గెలుపొందేందుకు సాధ్యమవుతుందని ఆమె అన్నారు.
ముంబయిలో మిథాలీ మాట్లాడుతూ... ఆస్ట్రేలియాలో ఉండే బ్యాట్స్‌మన్ ఫ్రెండ్లీ పిచ్‌లపై భారత బ్యాట్స్‌విమెన్‌లు రాణించగలరని విశ్వాసం వెలిబుచ్చారు. ఒక్కసారి పరుగుల క్రమం పడితే ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండబోదని మిథాలీ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే... ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టోర్నీల్లో భారత మహిళా జట్టు పేలవమైన ప్రదర్శనతో ఖంగుతిన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం బ్యాటింగ్‌లో నిలకడ లోపించడమేనని మిథాలీ విశ్లేషించారు. 120, 130 పరుగులు సాధించినట్లయితే గెలుపు ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించారు. బౌలర్లకు కూడా ఇది శక్తికిమించిన పనేనని ఆమె పేర్కొన్నారు.
ఇదే విషయమై భారత మహిళా జట్టు కోచ్ సుధా షా మాట్లాడుతూ... ప్రతి మ్యాచ్‌లోనూ తమ జట్టు 230 పరుగుల స్కోరును లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.