భారత్‌తో క్రికెట్ అంటే కాసుల పంట అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనేది తెలిసిందే. అయితే ఈ కాసుల పంటను ఎలాంటి ఆర్థిక మాంద్యాలు, ఆర్థిక సంక్షోభాలు అడ్డుకోలేవని చెప్పాలంటే మాత్రం... ప్రస్తుతం టీం ఇండియా కివీస్‌లో పర్యటించడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
టీం ఇండియా కివీస్ పర్యటించడంతో... న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) కోట్ల రూపాయలను పోగేసుకుంటోంది. ఏకంగా టెలివిజన్ హక్కులతోనే 25 మిలియన్ డాలర్లను ఎన్‌జెడ్‌సీ సంపాదించనుంది. దీనికితోడుగా టోర్నీ స్పాన్సర్‌షిప్, గ్రౌండ్ రైట్స్ లాంటి హక్కులతో రెండుచేతులా ఆర్జించనుంది.
ఇదిలా ఉంటే... కేవలం టీవీ ప్రసార హక్కులతోనే ఇంత పెద్ద స్థాయిలో (25 మిలియన్ డాలర్లు) డబ్బును పోగేసుకోవడం మాత్రం కివీస్ చరిత్రలో ఇదే ప్రథమమని ఆ దేశ మీడియా, క్రికెట్ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. ప్రపంచ కప్‌కు కూడా 20 మిలియన్లకు మించి రాలేదని వారంటున్నారు.
కాగా... మేటి జట్లయిన ఆసీస్, దక్షిణాఫ్రికాలతో సిరీస్ ఆడినప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తాన్ని కివీస్ ఆర్జించలేకపోయింది. అలాంటిది ప్రస్తుతం హాట్ ఫేవరేట్‌గా ఉన్న టీం ఇండియా ఆ దేశాన్ని పర్యటిస్తుండటంతో అందినకాడికల్లా డబ్బును వెనుకేసుకునే పనిలో కివీస్ బోర్డు యమ బిజీగా ఉందండోయ్..!