Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెట్ లీ స్థానంలో హారిస్: ఐసీసీ గ్రీన్ సిగ్నల్!

Advertiesment
బ్రెట్ లీ
PTI
ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 టోర్నమెంట్‌కు గాయం కారణంగా దూరమైన ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ స్థానంలో రియాన్ హారిస్‌ను ఐసీసీ రంగంలోకి దించింది. కరేబియన్ గడ్డపై శుక్రవారం (ఏప్రిల్ 30) నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్లో బ్రెట్‌లీకి బదులు రియాన్ హారిస్ ఆడుతాడని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ స్పష్టం చేసింది.

జింబాబ్వేతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బ్రెట్ లీకి మోకాలి కండరాల్లో గాయం ఏర్పడింది. దీంతో బ్రెట్ లీ స్వదేశానికి నిరాశతో తిరుగుముఖం పట్టాడు. కాగా.. బ్రెట్ లీ స్థానంలో బోలింగర్ లేదా రియాన్ హారిస్‌లలో ఎవరేని ఒకరిని రంగంలోకి దించాలని ఐసీసీ తీర్మానించింది.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్-3లో ధీటుగా రాణించిన రియాన్ హారిస్‌ను బ్రెట్ లీ స్థానంలో ఎంపిక చేసినట్లు ఐసీసీ గురువారం స్పష్టం చేసింది. ఇకపోతే.. న్యూ సౌత్ వేల్స్ ఆటగాడైన 30 ఏళ్ల రియాన్ హారిస్ ఇప్పటి వరకు రెండు టెస్టులు, 12 వన్డేలు మరియు రెండు ట్వంటీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడాడు.

ఇదిలా ఉంటే.. గాయం కారణంగా ట్వంటీ-20 ప్రపంచకప్ నుంచి వైదొలగిన బ్రెట్ లీ ఐదు వారాల్లో కోలుకుంటాడని ఫిజియోథెరపిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం భుజం, మోకాలి గాయంతో సతమతమతవుతున్న బ్రెట్ లీ త్వరలో గాయాల నుంచి కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఫిజియోథెరపిస్టు వెల్లడించారు.

12 నెలల తర్వాత ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడుతాడని ఎంతో ఉత్సాహంగా ఉండిన బ్రెట్‌ లీని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు స్వస్తి చెప్పిన బ్రెట్ లీ.. త్వరలో అంతర్జాతీయ వన్డే, ట్వంటీ-20ల్లో ఆడుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఫిజియోథెరపిస్టు చెప్పారు. కాగా.. ట్వంటీ-20 నుంచి గాయంతో నిష్క్రమించిన బ్రెట్ లీ.. సిడ్నీకి చేరుకున్నాడని సీఏ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu