బెట్టింగ్ ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తా: మోడీ
, మంగళవారం, 20 ఏప్రియల్ 2010 (10:15 IST)
తనపై చేస్తున్న బెట్టింగ్ ఆరోపణలపై పరువు నష్టం దావా వేయనున్నట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమిషనర్ లలిత్ మోడీ హెచ్చరించారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని పత్రికలు ఊహాజనిత కథనాలను రాస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఐపీఎల్ టోర్నమెంట్‌లో జోరుగా బెట్టింగ్‌లు చోటు చేసుకున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాజా వ్యవహారంపై ఆయన స్పందిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగం ఐపీఎల్ మ్యాచ్‌ల తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావులేదన్నారు. ఒక పత్రిక ఉద్దేశపూర్వకంగా తనను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు వార్తా కథనాన్ని ప్రచురించిందని ఆరోపించారు. ఆ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయిస్తానని, పరువునష్టం దావా వేస్తానని మోడీ వెల్లడించారు.