భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ప్రతినిధుల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ సమక్షంలో మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఐసీఎల్‌ను బీసీసీఐలో విలీనం చేసే అంశంపై ఐసీఎల్, బీసీసీఐల మధ్య దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో ఐసిసి అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ సమక్షంలో చర్చలు జరిగాయి.
దీనిపై డేవిడ్ మోర్గాన్ మాట్లాడుతూ బీసీసీఐ, ఐసీఎల్ మధ్య జరిగిన జరిగిన చర్చలు విఫలం కావడం నిరాశ కలిగించింది. అయితే ఈ చర్చలు మాత్రం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్టు వెల్లడించారు. సమస్య పరిష్కారం కోసం ఇరు వర్గాలకు చెందిన ప్రతినిధులు హాజరుకావడాన్ని ఆయన అభినందించారు.
స్నేహపూర్వక వాతావరణంలో జరిగినప్పటికీ.. పరిష్కారం కనుగొనలేక పోవడం నిరాశకు లోను చేసిందన్నారు. అలాగే, ఐసీఎల్‌కు ఐసిసి గుర్తింపు ఇచ్చే విషయంపై వచ్చిన వినతిపత్రాన్ని వచ్చే ఏప్రిల్ నెల దుబాయ్‌లో జరిగే సమావేశంలో పరిశీలిస్తామన్నారు.
కాగా, ఈ సమావేశానికి ఐసిసి ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాట్, బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా, ఐసీఎల్ ప్రతినిధి హిమాన్షు మోడీ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఐసీఎల్‌తో బారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన క్రికెటర్లు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెల్సిందే.