ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల రిప్రజెంటేటివ్ బాడీగా అయిన ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (పీసీఏ) ఛైర్మన్‌గా భారత సంతతికి చెందిన విక్రమ్ సోలంకి శుక్రవారం ఎన్నికయ్యాడు. భారత్‌లోని ఉదయ్‌పూర్‌లో జన్మించిన సోలంకి.. ఇంగ్లండ్ తరపున 51 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. ఈయన డొగీ బ్రౌన్ స్థానంలో నియమితులయ్యాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన సోలంకి, మరో ఐదు రోజుల్లో తన 35వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నాడు.
పీసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీన్ మోరీస్ సోలంకిని అభినందనల వర్షంలో ముంచెత్తాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీసీఏలో ఛైర్మన్ కార్యాలయం ప్రధాన పాత్ర పోషిస్తోంది. సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోకి విక్రమ్ సోలంకిని తాను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పాడు. దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిల్లో రెండు దశాబ్దాల అనుభవం గడించిన సోలంకి, పీసీఏ అభివృద్ధికి బాగా కృషి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.