ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరో దేశంలో నిర్వహించాలని నిర్ణయించడంతో ప్రతి చోటా తీవ్రవాద సమస్య ఉందనే విషయం తేటతెల్లమవుతోందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వ్యాఖ్యానించింది. కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా ఎక్కడైనా తీవ్రవాదుల సమస్య ఉన్నట్టు తేలిందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భద్రత అనేది ప్రధాన సమ్యగా ఉంది. తీవ్రవాదులు ఏ దేశంలోనైనా ఘాతుకానికి పాల్పడవచ్చు. భారత్ నుంచి ఐపీఎల్‌ను తరలించడం తమ వాదనకు బలం చేకూర్చుతోందని పీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి తరుణంలో పాక్‌లోని భద్రతా ప్రమాణాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆందోళన వ్యక్తం చేయడం పక్షపాతంతో కూడుకుందన్నారు.
పాక్‌లో పర్యటించే ప్రతి విదేశీ జట్టుకు అవసరమైన భద్రతను బోర్డు కల్పిస్తుందని స్పష్టం చేశారు. తమ దేశంలో క్రికెట్ క్రీడను పరిరక్షించేందుకు అన్ని టెస్ట్ దేశాల సహాయం కోరుతున్నామని, తమ అభ్యర్థనను అన్ని దేశాలు అర్థం చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ టోర్నీలో తమ ఆటగాళ్లు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఆయన తెలిపారు.