నేను రాను.. రాజీనామా చేయను: బీసీసీఐకు మోడీ మెయిల్
ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ బాగా రాటుదేలి పోయారు. ఏప్రిల్ 26వ తేదీన బీసీసీఐ నిర్వహించనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి తాను హాజరు కాలేననీ, మే నెలలో హాజరు కావాలనుకుంటున్నాని ఇ - మెయిల్ ద్వారా బీసీసీఐకి తెలిపారు. ఒకవేళ ఏప్రిల్ 26నే సమావేశాన్ని ఏర్పాటు చేస్తే తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమావేశానికి హాజరయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.మోడీ ఇ- మెయిల్ వ్యవహారాన్ని బీసీసీఐ వద్ద ప్రస్తావిస్తే... ఆయన రాకపోయినా సమావేశం జరుగుతుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. ఇదిలావుంటే బీసీసీఐకి రాసిన మెయిల్‌లో మోడీ మరికొన్ని విషయాలను కూడా జోడించినట్లు తెలిసింది. పది రోజుల క్రితమే తాను షేర్ హోల్డర్లకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని చెప్పినప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులైన శశాంక్ మనోహర్, అరుణ్ జైట్లీ అడ్డుకున్నారంటూ వారిపైనా మోడీ బాణాలు విసిరారు. ఈ ఇ- మెయిల్ సారాంశాన్ని బట్టి చూస్తే లలిత్ మోడీ తన పదవి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వైదొలగే ప్రసక్తే లేదని తేటతెల్లమవుతోంది. ఈ నేపధ్యంలో "మొండి" మోడీని పదవి నుంచి ఎలా పీకేయాలన్నదానిపై బీసీసీఐ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు భోగట్టా. ఇందుకు అనుసరించవలసిన వ్యూహమేమిటన్నదానిపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్రం నుంచి మోడీ ఉద్వాసనకు తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఒత్తిడి ఫలితంగా శరద్ పవార్ ఎలాగైనా లలిత్ మోడీని ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచి రాజీనామా చేయించే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే మోడీ మాత్రం నిజానిజాల్ని బయటపెట్టిన తర్వాతే మిగిలిన విషయాలపై మాట్లాడుతానని చెపుతున్నారు. మొత్తమ్మీద మోడీ వ్యవహారం బీసీసీఐకి పంటికింద రాయిలా కనిపిస్తోంది.