Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు బెంగళూరుతో డెక్కన్ ఛార్జర్స్ "ప్లే ఆఫ్ మ్యాచ్"

Advertiesment
క్రికెట్
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఓటమిపాలై టైటిల్ పోరుకు దూరమైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, డెక్కన్ ఛార్జర్స్ జట్లు నేడు "ప్లే ఆఫ్ మ్యాచ్"లో తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే "ఛాంపియన్స్ లీగ్"లో భారత్ తరపున మూడో జట్టుగా బరిలో దిగే అవకాశం సంపాదిస్తుంది.

ఇదిలా ఉంటే.. గత సంవత్సరం జరిగిన ఐపీఎల్-2లో బెంగళూరు, డీసీ జట్లు ఫైనల్స్‌లో తలపడగా, అందులో డీసీ విజయం సాధించి టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లో విన్నర్‌గా డీసీ జట్టు, రన్నరప్ హోదాలో బెంగళూరు రాయల్స్ తలపడ్డాయి. అయితే ఈసారి ఆ అవకాశం కూడా కోల్పోవటంతో ఇరుజట్లూ తాజాగా మూడో స్థానంపై గురిపెట్టి శనివారం బరిలో దిగనున్నాయి.

ఐపీఎల్ రెండో సీజన్‌లో టైటిల్ ఎగురేసుకుపోయిన డెక్కన్ ఛార్జర్స్‌పై బదులు తీర్చుకోవాలని బెంగళూరు రాయల్స్ ఓవైపు ఆరాటపడుతుండగా, మరోవైపు రాయల్స్‌ను ఎలాగైనా సరే మట్టిగరిపించాలని డీసీ పట్టుదలగా ఉంది. ఈ సందర్భంగా డీసీ కెప్టన్ గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. సెమీస్‌లో చెన్నై చేతిలో పరాజయం పాలయిన తమ జట్టు సభ్యులంతా బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా నెగ్గి తీరాలనే లక్ష్యంతో సన్నద్ధమవుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే.. టోర్నీ ప్రారంభంలో మంచి ఫామ్‌లో ఉంటూ, జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ కలిస్ ఈరోజు విజృంభించి ఆడితే మ్యాచ్ ఫలితం తమవైపు ఉంటుందని బెంగళూరు భావిస్తోంది. అలాగే లోయర్ ఆర్డర్‌లో గమ్మత్తైన ఆటతీరుతో విజయాలు అందించిన ఊతప్ప, పీటర్సన్‌లో మరోసారి విజృంభించి ఆడాలని కోరుకుంటోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే డేల్ స్టెయిన్ ప్రారంభంలో వికెట్లు తీస్తే, ఆ తరువాత పనిని కుంబ్లే పూర్తి చేస్తాడనీ బెంగళూరు పథకాలు రచిస్తోంది. దీంతో బెంగళూరు-డెక్కన్ ఛార్జర్స్‌ల నడుమ నేటి పోరాటం మరో ఫైనల్స్‌ను తలపిస్తుందంటే అతిశయోక్తి కాదేమో..!!

Share this Story:

Follow Webdunia telugu