దాదా విధ్వంసకర ఇన్నింగ్స్: కోల్‌కతా ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో.. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి ఆడాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్‌తో తలపడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 24 పరుగుల తేఢాతో ఘన విజయం సాధించింది. దీంతో డీసీ జట్టు వరుస ఓటములతో హ్యాట్రిక్ కొట్టింది.అంతకుముందు టాస్ గెలిచిన నైట్‌రైడర్స్ కెప్టెన్ గంగూలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముందుగా ఇన్నింగ్స్‌ను గంగూలీ-గేల్‌లు ఆరంభించారు. తొలి బంతినే గంగూలీ బౌండరీ కొట్టి ఛార్జర్స్ బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. అయితే గేల్ 4, పుజారా 17, మనోజ్ తివారీ 5 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరారు.ఇలాంటి సమయంలో డేవిడ్ హస్సీ సాయంతో వికెట్ల పతానాన్ని అడ్డుకోవటమేగాకుండా, తనదైన శైలిలో విజృంభించి ఆడిన గంగూలీ 88 పరుగులను సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులను సాధించింది. కాగా.. విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించిన గంగూలీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.ఆ తరువాత 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన డెక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 157 పరుగులు మాత్రమే సాధించి అపజయం పాలయ్యింది. ముందు భారీ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన డీసీ ఓపెనర్లు మెరుపువేగంతో బ్యాటింగ్ ప్రారంభించారు. గిబ్స్ 50, సైమండ్స్ 45 పరుగులతో రాణించినా ఫలితం దక్కలేదు. గిల్లీ, మిశ్రా, గిబ్స్, రోహిత్, సైమండ్స్‌లు వరుసగా పెవిలియన్ చేరటంతో 157 పరుగుల వద్దనే డీసీ కుప్పకూలిపోయింది. మరోవైపు.. తాజా ఓటమితో డీసీ ఏడో స్థానానికి పడిపోగా, కోల్‌కతా ఐదో స్థానానికి ఎగబాకింది.