ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్‌లో మెరుపులు మెరిపించి, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనపరచిన రియోల్ఫ్ వెన్ డెర్ మెర్వేకు దక్షిణాఫ్రికా వన్డే జట్టులో చోటు దక్కింది. వచ్చే నెల 3 నుంచి 17వ తేదీల మధ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. ఇందులోభాగంగా తొలి రెండు వన్డేలకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. 24 సంవత్సరాల ఆల్‌రౌండర్ మెర్వేకు ఈ రెండు వన్డేలకు స్థానం కల్పించారు.
ఆదివారం జరిగిన రెండో వన్డేలో 30 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేయడమే కాకుండా, కీలకమైన డేవిడ్ హుస్సే వికెట్‌ను పడగొట్టాడు. దీంతో రెండు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనిపై ఆ దేశ చీఫ్ సెలక్టర్ మైక్ ప్రొక్టర్ మాట్లాడుతూ గాయంతో బాధపడుతున్న జాక్వెస్ కలీస్‌కు ప్రత్యామ్నాయంగా రియోల్ఫ్ అందుబాటులోకి వచ్చాడని చెప్పారు.
అయితే, జాక్వెస్ కెల్లీస్ ఫిట్‌నెస్‌ను సోమవారం జరిగే జట్టు సమావేశంలో పరిశీలిస్తామని చెప్పారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వచ్చే శుక్రవారం కింగ్స్‌మెడ్‌లోని సహారా స్టేడియంలోను, రెండో వన్డే సూపర్ స్పోర్ట్ పార్క్‌లో ఆదివారం జరుగుతుందని క్రికెట్ దక్షిణాఫ్రికా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.