రికార్డు స్థాయిలో అత్యధికంగా 126 టెస్ట్ మ్యాచ్‌లలో అంపైర్‌గా పనిచేసిన వెస్టిండియన్ వెటరన్ స్టీవ్ బక్నర్.. త్వరలో అంపైరింగ్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ మేరకు దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య కేప్‌టౌన్‌లో జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందని బక్నర్ వెల్లడించాడు.
ఈ విషయమై బక్నర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇప్పటికే తన నిర్ణయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ఐసీసీ)కి తెలియజేశానని పేర్కొన్నాడు. తాను అంపైర్‌గా కొనసాగేందుకు శారీరకంగా ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యా లేదని చెప్పిన బక్నర్.. రిటైరయ్యేందుకు మాత్రం ఇదే తగిన సమయమని అన్నారు.
మరో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు మైదానంలో ఏ ఇబ్బందీ లేకుండా నిల్చోగలనని తనకు తెలుసనీ... అయితే రిటైరవ్వాల్సిన సమయం వచ్చేసిందని తన అంతరాత్మ పదే పదే చెబుతోందని బక్నర్ వివరించాడు.
ఐసీసీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వంద టెస్ట్‌లు పూర్తి చేసిన బక్నర్.. కరేబియన్ దీవుల్లో అంపైరింగ్ టాలెంట్‌ను వెలికి తీసేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో కలసి పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు.
ఇదిలా ఉంటే... జమైకాలోని మాంటెగో బే నివాసి అయిన స్టీవ్ బక్నర్‌కు ప్రస్తుతం 62 సంవత్సరాలు. వరుసగా ఐదు వరల్డ్ కప్ టోర్నమెంట్‌లలో అంపైర్‌గా పాల్గొన్న ఈయన... 179 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లలో కూడా అంపైరింగ్ చేశాడు.