తోక ముడిచిన లలిత్ మోడీ: తదుపరి ఛైర్మన్ రవిశాస్త్రి..?!
ఏప్రిల్ 26వ తేదీన బీసీసీఐ ఏర్పాటు చేసే సమావేశానికి రానంటే రాననీ, అవసరమైతే కోర్టుకు సైతం వెళతానని బెదిరించిన లలిత్ మోడీ చివరకి తోక ముడిచినట్లు తెలుస్తోంది. ఉన్నట్లుండి తన స్వరాన్ని మార్చుకుని బీసీసీఐ తనకు నాలుగైదు రోజులు ఇవ్వాలని ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. చివరికి ఆ మాటను కూడా వెనక్కి తీసుకుని బీసీసీఐ చెప్పినట్లు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. విశ్వసనీయ సమచారం ప్రకారం ఏప్రిల్ 26న జరిగే బీసీసీఐ సమావేశంలో లలిత్ మోడీ ఐపీఎల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజీనామా చేసేందుకు మోడీ మొండికేస్తే తమకున్న విశేషాధికారాలతో నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తప్పించడానికి అవసరమైన అన్ని చర్యలను బీసీసీఐ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ఐపీఎల్ కుంభకోణంలో మరికొంతమంది కేంద్రమంత్రుల హస్తం ఉన్నదని ఆరోపణలు వస్తుండటంతో మోడీ తొలగింపుతో సమస్యకు చెక్ పెట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన మనోరహర్, లలిత్ మోడీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి మోడీ ఏప్రిల్ 26న బీసీసీఐ ఏర్పాటు చేయనున్న సమావేశానికి హాజరై తనంత తానుగా రాజీనామా సమర్పించే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది. మరోవైపు కేంద్రవ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ సైతం మోడీతో టచ్లో ఉంటున్నారు. సమస్యను మరింత జఠిలం చేయకుండా రాజీనామా సమర్పించాలని మోడీని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. మోడీ రాజీనామా చేసిన వెంటనే ఐపీఎల్ చీఫ్గా రవిశాస్త్రిని ఆ పదవికి ఎంపిక చేస్తారని సమాచారం.