ముంబై ఇండియన్స్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నోరుపారేసుకున్నాడు. దీంతో భజ్జీకి మ్యాచ్ రెఫరీ 15 వేల డాలర్ల అపరాధం విధించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టుతో ముంబై ఇండియన్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో డెక్కన్ జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ తిరుమల శెట్టిని హర్భజన్ దూషించాడు.
దీనిపై ఏపీఎల్ ప్రిన్సిపల్ ఆర్గనైజర్ సుందర్ రామ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఔటైన సుమంత్ శెట్టి పెవిలియన్‌కు వెళుతుండగా, భజ్జీ నోరు జారాడని, దీంతో మ్యాచ్ రెఫరీ గుండప్ప విశ్వనాథన్ 15 వేల డాలర్ల అపరాధం విధించినట్టు రామ్ పేర్కొన్నారు. కాగా, డెక్కన్ ఛార్జర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో భజ్జీ 49 పరుగులు చేశారు. ఆ తర్వాత 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు.. ఓటమి పాలైన విషయం తెల్సిందే. అయితే, బ్యాట్స్‌మెన్ తిరుమల శెట్టి.. భజ్జీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ సమయంలో నిగ్రహం కోల్పోయిన భజ్జీ శెట్టిని పరుష పదజాలంతో దూషించినట్టు రామ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.