టీ-20 వరల్డ్‌కప్‌కి పటిష్టమైన జట్టును ఎంపికచేశాం: శ్రీకాంత్
కరేబియన్ గడ్డపై జరుగనున్న పరిమిత ఓవర్ల ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడేందుకుగాను పటిష్టమైన భారత జట్టును ఎంపిక చేశామని జాతీయ సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి మే 16వ తేదీ వరకు వెస్టిండీస్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఆడే భారత జట్టును శుక్రవారం జాతీయ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.14
మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో గాయాలతో సతమతమవుతున్న గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రాలతో పాటు ఐపీఎల్‌లో పరుగుల సాధనకు కొట్టుమిట్టాడుతున్న యువరాజ్ సింగ్‌కు కూడా స్థానం దక్కడంపై అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి తోడు గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లను ఎంపికచేయడంపై క్రీడా విశ్లేషకుల నుంచి పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై సీనియర్ సెలక్టర్ శ్రీకాంత్ ముంబైలో మాట్లాడుతూ.. ట్వంటీ-20 ప్రపంచకప్‌కు పటిష్టమైన ఆటగాళ్లతో కూడిన జట్టునే ఎంపిక చేశామని చెప్పారు. జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శన సంతృప్తికరంగా ఉండటంతోనే వారిని టీ-20 జట్టులో చోటు కల్పించామని వెల్లడించారు. ప్రస్తుతం ట్వంటీ-20 కోసం ఎంపికైన క్రికెటర్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారని శ్రీకాంత్ అన్నారు. ట్వంటీ-20 ప్రపంచకప్ ప్రారంభమయ్యేందుకు ఇంకా ఒక నెల కాలపరిమితి ఉందని, ఈ మెగా ఈవెంట్లో భారత్ రాణిస్తుందని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. వెస్టిండీస్ మైదానాల్లోని క్రీజులు భారత్ ఆటగాళ్లకు అనుకూలిస్తాయని, ఇంకా బ్యాటింగ్ చేయడానికి వీలుగా ఉంటాయని ఆయన వెల్లడించారు.