ఇంగ్లండ్ జట్టు తరపున అంకితభావంతో ఆడుతానని ఇంగ్లండ్ క్రికెటర్ పీటర్సన్ అన్నాడు. అయితే తన భార్య, గాయని జెసికా టేలర్ వెంట లేకుండా ఇకపై సుదీర్ఘ పర్యటనకు వెళ్లబోనని పీటర్సన్ స్పష్టం చేశాడు. పర్యటనకు వెళ్లనని ఏ రోజూ చెప్పలేదని, కానీ పర్యటనకు దూరమయ్యే ప్రసక్తే లేదని పీటర్సన్ వెల్లడించాడు. ఇకపై 11 వారాల పాటు సాగే పర్యటనకు టేలర్ లేకుండా వెళ్లేది లేదని తెలిపాడు.
ఇప్పటికే పీటర్సన్ సారథ్యంలో, టీం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లలో ఇంగ్లండ్ విఫలమైందని అతనిని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్సన్ మాట్లాడుతూ.. క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని, వందశాతం ఇంగ్లండ్ జట్టు తరపున అంకితభావంతో ఆడతానని పీటర్సన్ హామీ ఇచ్చాడు.
ఇదిలా ఉండగా.. విండీస్ పర్యటన మధ్యలో రెండు రోజులు ఇంటికి వెళ్లి వస్తానని పీటర్సన్ చేసిన విజ్ఞప్తిని ఇంగ్లండ్ జట్టు మేనేజ్‌మెంట్ తిరస్కరించడంతో అతనిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇంగ్లండ్ జట్టులో తాను ఒంటరి వాడిననిపిస్తోందని పీటర్సన్ ఓ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టులో కొనసాగాలంటే, పీటర్సన్ తననెంతో మార్చుకోవాలని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.