గూగుల్ సర్వే: సచిన్, డెక్కన్ ఛార్జర్స్లకే అధిక ఓట్లు!
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరియు హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్లకు తాజాగా నిర్వహించిన సర్వేలో అధిక శాతం ఓట్లు రాలాయి. ప్రముఖ ఆన్లైన్ సంస్థ గూగుల్ నిర్వహించిన జెట్గెస్ట్ (స్పిరిట్ ఆఫ్ టైమ్స్) 2010 సర్వేలో మోస్ట్ పాపులర్ క్రికెటర్ విభాగంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టాప్లో నిలవగా, మోస్ట్ పాపులర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టుగా డెక్కన్ ఛార్జర్స్ నిలిచింది. అలాగే అత్యధిక ప్రఖ్యాతి సాధించిన అంతర్జాతీయ క్రికెటర్ విభాగంలో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ నిలిచాడు. గూగుల్ సర్చ్ ఆధారంగా నిర్వహించిన ఈ సర్వేలో గత ఏడాది మోస్ట్ పాపులర్ క్రికెటర్గా రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్, ఈ ఏడాది అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే ప్రఖ్యాత ఐపీఎల్ జట్టు విభాగంలో గత సంవత్సరం మూడో స్థానంలో నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ ఈసారి టాప్లో నిలవడం గమనార్హం.