వచ్చే ఐపీఎల్ రెండో సీజన్లో అసలైన ట్వంటీ-20 జట్టులా బరిలో నిలుస్తామని రాయల్ ఛాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఐపీఎల్ తొలి సీజన్ సందర్భంగా టెస్టు జట్టు అంటూ అపవాదులు ఎదుర్కొన్న తమ జట్టు కొత్త ఆటగాళ్ల చేరికతో అసలు సిసలు టీ-20 జట్టుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విషయమై మాల్యా మాట్లాడుతూ పీటర్సన్, ఊతప్ప, రైడర్‌లాంటి ఆటగాళ్ల చేరికతో తమ రాయల్ ఛాలెంజర్స్ బలీయంగా తయారైందని అన్నారు. చక్కని బ్యాట్స్‌మెన్‌గా పేరున్న ఆటగాళ్లు తమ జట్టులో చేరిన తరుణంలో ఇకపై తమది టెస్టు జట్టు అని ఎవరూ అనలేరని ఆయన పేర్కొన్నారు.
అదేసమయంలో డేల్ స్టెయిన్, జాక్వస్ కలీస్‌లాంటి ఆటగాళ్లు ఉన్నందున దక్షిణాఫ్రికాలో జరగనున్న ఐపీఎల్ రెండో సీజన్‌లో తమ జట్టుకు మంచి ఆదరణ లభించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.