న్యూజీలాండ్ వికెట్లపై టీం ఇండియా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ దేశ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కివీస్‌లో పర్యటిస్తున్న టీం ఇండియా ముందుగా రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనున్న సంగతి పాఠకులకు విదితమే. ఇందులో తొలి ట్వంటీ20 మ్యాచ్ బుధవారం జరగనుంది.
ఈ నేపథ్యంలో మార్క్ టేలర్ మాట్లాడుతూ.. వికెట్లు ఎలా ఉంటాయన్న విషయంపైన టీం ఇండియా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. భారత్ గతంలో పర్యటించిన సమయంలో వికెట్లకు, ఇప్పటి వికెట్లకు చాలా తేడా ఉన్నాయనీ.. అదే విధంగా పిచ్ పరిస్థితులు కూడా ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయని వివరించాడు. కాగా, గత పర్యటనలో ఆడిన వన్డే, టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ అత్యధిక స్కోరు 219 పరుగులు మాత్రమే కావడం గమనించదగ్గ అంశం.
కివీస్‌లోని మైదానాల్లో పచ్చిక, వికెట్లపై సీమ్ కారణంగా టీం ఇండియా ఆటగాళ్లు బాధపడతారని తాను భావించటం లేదని టేలర్ అభిప్రాయపడ్డాడు. తమ దేశ క్రికెట్‌లో వచ్చిన అనూహ్య మార్పులు పిచ్ పరిస్థితులను పూర్తిగా మార్చి వేశాయని అన్నాడు. టీం ఇండియా ఆటగాళ్లు ఈ మార్పును తప్పకుండా గమనిస్తారని చెప్పాడు. ఇదిలా ఉంటే... ఆసీస్ వికెట్ల కంటే తమ వికెట్లపైనే బౌన్స్ తక్కువగా ఉంటుందని టేలర్ వెల్లడించాడు.