Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన "టీమ్ ఇండియా"

Advertiesment
న్యూజిలాండ్ టీమ్ ఇండియా చరిత్ర వన్డే సిరీస్ కైవసం టెస్టు విజయం వికెట్లు సచిన్ టెండూల్కర్ హర్భజన్ సింగ్
న్యూజిలాండ్ గడ్డపై "టీమ్ ఇండియా" చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుని రికార్డు సృష్టించిన భారత జట్టు తొలి టెస్టులో విజయకేతనం ఎగుర వేసింది. 1976 సంవత్సరాల తర్వాత కివీస్ గడ్డపై భారత్ టెస్టులో విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విజయంలో భారత టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ఆరు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 160 పరుగులతో బ్యాటింగ్‌లో రాణించాడు. ఫలితంగా న్యూజిలాండ్‌పై పది వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.

అంతకుముందు.. కివీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో కూడా 279 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు వికెట్ కీపర్ మెక్‌కల్లమ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో కివీస్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకుంది. దీంతో భారత జట్టు ముంగిట 39 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం 39 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన భారత ఓపెనర్లు గౌతం గంభీర్, రాహుల్ ద్రావిడ్‌లు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి పది వికెట్ల విజయాన్ని అందించారు. గంభీర్ 18 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేయగా, ద్రావిడ్ 14 బంతుల్లో రెండు ఫోర్లతో ఎనిమిది పరుగులు చేశాడు.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 75/3తో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్‌కు హర్భజన్ చుక్కలు చూపించాడు. మూడోరోజు ఆటలో ఒక వికెట్ తీసుకున్న హర్భజన్ నాలుగోరోజు ఆటలో ఫ్లైన్, రైడర్, ఫ్రాంక్లిన్, వెట్టోరి, బ్రైన్ వికెట్లను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా కివీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.

హర్భజన్‌కు తోడు నాలుగోరోజు ఆటలో యువరాజ్, మునాఫ్ పటేల్‌లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. కివీస్ తరపున రెండో ఇన్నింగ్స్‌లో కీపర్ మెక్‌కలమ్ అత్యధికంగా 84 పరుగులు సాధించగా, ఫ్లైన్ (67), గుప్టిల్ (48), వెట్టోరీ (21), రైడర్ (21)లు రాణించారు. న్యూజిలాండ్ తన రెండు ఇన్నింగ్స్‌లోనూ 279 పరుగుల వద్దే ఆలౌట్ కావడం విశేషం.

స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 279 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 520 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : వికెట్ నష్టపోకుండా 39 పరుగులు.
ఫలితం.. పది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

Share this Story:

Follow Webdunia telugu