ఐస్‌లాండ్ బూడిద దెబ్బ: విండీస్‌కు భారత్ వెళ్లే దారేదీ!
కరేబియన్ గడ్డపై ఈ నెలాఖరు నుంచి ప్రారంభంకానున్న ట్వంటీ-20 ప్రపంచకప్‌కు టీం ఇండియా వెళ్లే మార్గంపై గందరగోళం నెలకొంది. ఐస్‌లాండ్ అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద కణాల కారణంగా యూరప్‌లో విమానాశ్రయాలన్నీ మూతపడివున్నాయి. ఫలితంగా.. ఆ దేశం మీదుగా ఇతర దేశాలకు వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో... భారత జట్టు ఈనెల 27వ తేదీన భారత జట్టు ముంబై నుంచి వెస్టిండీస్‌కు బయలుదేరాల్సి వుంది. అయితే, అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద కారణంగా వెస్టిండీస్‌కు ఏ మార్గం ద్వారా చేరుకోవాలనే అంశంపై టీం ఇండియా యాజమాన్యం ఆలోచన చేస్తోంది. ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సలహా తీసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇదిలావుంటే.. కరేబియన్ గడ్డపై ఈ నెల 30వ తేదీన ట్వంటీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలు ప్రారంభానికి ముందుగానే అన్ని జట్లూ కరేబియన్ దీవులకు చేరుకోవాల్సి వుంది. అయితే, భారత్ జట్టు నిర్ణీత తేదీ లోగా చేరుకునే అంశంలోనే ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లండన్ మీదుగా వెస్టిండీస్‌కు వెళ్లాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఇలా వెళ్లడం వల్ల నిర్ణీత గడువులోగా చేరుకుంటామా లేదా అనేది జట్టు యాజమాన్యాన్ని వేధిస్తోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో ఓ స్పష్టత రావచ్చని టీమ్ ఇండియా వర్గాలు పేర్కొంటున్నాయి.