ఐసీసీ వార్మప్ మ్యాచ్: వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల గెలుపు!
ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 వార్మప్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు గెలుపును నమోదు చేసుకున్నాయి. కరేబియన్ గడ్డపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ట్వంటీ-20లో భాగంగా బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో.. వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ నెగ్గగా, శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. వెస్టిండీస్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే బ్రాండన్ మెక్‌కల్లమ్, వెట్టోరి, స్టైరిస్, గుప్తిల్ వంటి ఆరుగురు కీలక ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. దీంతో 37 పరుగులకే కివీస్ ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే తర్వాత బరిలోకి దిగిన రాస్ టైలర్ (50) 35 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్థ సెంచరీని నమోదు చేసుకుని, జట్టును ఆదుకున్నాడు. జాకోబ్ ఓరమ్ 40 బంతుల్లో మూడు బౌండరీలు, రెండు సిక్సర్లతో 46 పరుగులు సాధించి, నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 124/8 స్కోరుతో సరిపెట్టుకుంది. ఇకపోతే.. వెస్టిండీస్ బౌలర్లలో సులైమాన్ బెన్, రామ్‌పాల్, సమ్మీ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. తదనంతరం న్యూజిలాండ్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆటగాళ్లలో గెయిల్ (35) వికెట్‌కు వెస్టిండీస్ 9 ఓవర్లలో 68 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన బ్రావో 3 పరుగులకే అవుటయ్యాడు. అయితే తర్వాత క్రీజులోకి దిగిన చందర్‌పాల్ నిలకడగా ఆడాడు. కానీ చందర్‌పాల్, బ్రావో, సర్వాన్, సమ్మీ, రామ్ దిన్‌లు వెంట వెంటనే అవుట్ కావడంతో వెస్టిండీస్ 117 పరుగులకే ఆలౌటైంది. మరోవైపు బుధవారం జరిగిన మరో ఐసీసీ ట్వంటీ-20 వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా సునాయాసంగా విజయం సాధించింది. బ్రిడ్జ్‌టౌన్‌లో శ్రీలంక-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు సాధించింది. శ్రీలంక నిర్ధేశించిన విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మూడు బంతులు మిగిలి వుండగానే లక్ష్యాన్ని అధిగమించింది.