ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో... టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ 10లోనూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టాప్ 20లోనూ చోటుదక్కించుకున్నారు. అలాగే, ఆల్‌రౌండర్ల జాబితాలో యువరాజ్ సింగ్ మూడో స్థానంలో నిలిచాడు. కాగా, ఇది యూవీ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం.
ఈ మేరకు ఐసీసీ సోమవారం వెల్లడించిన వన్డే ర్యాంకింగ్స్‌లో సచిన్, వీరేంద్ర సెహ్వాగ్‌లు తమ స్థానాలను బాగా మెరుగుపరచుకున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా 1-3 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయంలో సచిన్, సెహ్వాగ్‌లు కీలక పాత్ర పోషించిన సంగతి కూడా పాఠకులకు విదితమే.
ఇదిలా ఉంటే... తాజా సిరీస్‌లో 299 పరుగులు సాధించిన సెహ్వాగ్ తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకొని ఆరో స్థానంలో నిలిచాడు. అంతేగాకుండా, గత ఆరేళ్ల కాలంలో వీరూ టాప్ 10లో స్థానం సంపాదించుకోవడం ఇదే మొదటిసారి. అలాగే సచిన్ కూడా ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకొని 13వ స్థానంలో నిలిచాడు.
ఇకపోతే... తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ టీం ఇండియా కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో యువరాజ్ సింగ్, గంభీర్‌లు వరుసగా ఒకటి, నాలుగు స్థానాలు కోల్పోయారు. యువరాజ్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉండగా, గంభీర్ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ గిబ్స్‌తో కలిసి 16వ స్థానంలో కొనసాగుతున్నాడు.