ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌కు సర్వం సిద్ధం: ఐసీసీ
కరేబియన్ గడ్డపై ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాలకు చెందిన పురుషుల క్రికెట్ జట్లు సంసిద్ధమయ్యాయి. 12 మందితో కూడిన ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో ఆడే పురుషుల జట్లను అన్ని దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. ఇందులో భాగంగా.. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ జట్టును కూడా పీసీబీ ఇప్పటికే ప్రకటించింది. ఐసీసీ ట్వంటీ-20లో ఆడే పాక్ జట్టుకు షాహిద్ అఫ్రిది నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇంకా పాక్ జట్టు మిస్బావుల్ హక్, మొహమ్మద్ ఆసిఫ్, అబ్దుల్ రజాక్, ఉమర్ గుల్, ఉమర్ అక్మల్, సయీద్ అజ్మల్ మొహమ్మద్ అమీర్ వంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. అలాగే వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తోన్న వెస్టిండీస్ జట్టు కూడా మేటి క్రికెటర్ క్రిస్ గేల్ కెప్టెన్సీ సారథ్యంలో ట్వంటీ-20 సమరానికి సంసిద్ధంగా ఉంది. మరోవైపు భారత జట్టు కూడా ఈసారి ట్వంటీ-20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. 2007 ట్వంటీ-20 విజేతగా నిలిచిన భారత్, మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, యూసుఫ్ పఠాన్ వంటి థ్రిల్లింగ్ క్రీడాకారులతో తిరుగులేని జట్టుగా నిలిచింది. ఇంకా ఈ ఏడాది ప్రపంచకప్ ట్వంటీ-20 మెగా ఈవెంట్‌కు ఆప్ఘనిస్థాన్, ఐర్లాండ్‌లు అర్హత సాధించాయి. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభమయ్యే ఆరంభ మ్యాచ్ గుయానాలో జరుగనుండగా, ఫైనల్ కెన్సింగ్టన్ ఓవల్, బర్బడోస్‌లలో మే 16న జరుగుతుందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.