ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) తలరాతను తేల్చి చెప్పేందుకుగానూ.. ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ఐసీసీ) గవర్నింగ్ బాడీ, ఏఫ్రిల్ నెలలో దుబాయిలో సమావేశం కానుంది. తమకు గుర్తింపు నివ్వాలని కోరుతూ.. ఐసీఎల్ చేసుకున్న దరఖాస్తుపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఐసీఎల్- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ)ల మధ్య రాజీ కుదిర్చేందుకుగానూ... సోమవారం ఐసీసీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఐసీసీ ప్రెసిడెంట్ డేవిడ్ మోర్గాన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లొర్గాత్, బీసీసీఐ సెక్రటరీ ఎన్. శ్రీనివాసన్, ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర మరియు ఐసీఎల్ బిజినెస్ హెడ్ హిమన్షు మోడీ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం డేవిడ్ మోర్గాన్ మాట్లాడుతూ... చర్చలకు వచ్చినందుకు ఇరుపక్షాలవారికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందనీ.. అయితే చర్చలు ఓ కొలిక్కి రాలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. మళ్లీ చర్చలు జరిగే విషయం గురించి ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేమని మోర్గాన్ ప్రకటించారు.