ఐపీఎల్‌లోనూ బాల్ టాంపరింగ్ జరుగుతోంది..!: వసీమ్ అక్రమ్
ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బాల్ టాంపరింగ్ జరుగుతుందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వాసిమ్ అక్రమ్ బాంబు పేల్చాడు. ఇప్పటికే వివాదాల చిచ్చులో ఉన్న ఐపీఎల్‌లో కొందరు క్రికెటర్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతున్నారని అక్రమ్ తెలిపాడు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఫ్రాంచైజీ జట్టు, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వసీమ్ అక్రమ్ వ్యవహరిస్తున్నాడు. మైదానంలో కొంతమంది ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినా, ఫీల్డ్ అంపైర్లు ఈ విషయాన్ని పసిగట్టకపోవడం దారుణమని అక్రమ్ అన్నాడు. కానీ టాంపరింగ్ పాల్పడుతున్నారంటూ.. తానెవ్వరి పేరును వెల్లడించలేనని అక్రమ్ దాటవేశారు. కానీ కొంతమంది ఆటగాళ్లు మైదానంలోని ఎర్రటి తడి మట్టితో బంతిపై రుద్దడం తాను గమనించానని వాసిమ్ అన్నారు. ఇది కూడా బాల్ టాంపరింగ్ కిందకే వస్తుందని అక్రమ్ తెలిపారు. ఎర్ర నేలలైన రాజస్థాన్, ముంబై, అహ్మదాబాద్‌లలో జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా.. 18, 19వ ఓవర్ల వద్ద ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతిని చూడటం చాలా కష్టమని, దీన్ని అవకాశంగా తీసుకుని బంతిపై తడి మట్టితో రుద్దుతూ బ్యాట్స్‌మెన్ల ఆటతీరుకు బ్రేక్ వేసేందుకు, లేదా వికెట్ తీసుకునేందుకు బౌలర్లు టాంపరింగ్‌కు పాల్పడుతున్నారని వసీమ్ అక్రమ్ వెల్లడించారు.